నారద వర్తమాన సమాచారం
పవన్ ఎఫెక్ట్ – చంద్రబాబు అలర్ట్, కీలక మార్పు..!!
అమరావతి
జూన్ :21
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. పాలనా పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికార యంత్రాంగ ప్రక్షాళన మొదలైంది. ఏపీ అసెంబ్లీ కొలువు తీరనుంది. ఇదే సమయంలో గత ప్రభుత్వ నిర్ణయాల పైన సమీక్ష మొదలైంది. గత ప్రభుత్వ పథకాల పేర్లను ప్రస్తుత ప్రభుత్వం మార్పు చేసింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఎఫెక్ట్ తో నిర్ణయాల విషయంలో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. పేర్ల మార్పులో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్ల మార్పు మొదలైంది. ఇందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జగనన్న విద్యాదీవెనగా కొనసాగుతున్న పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌గా మార్చారు. వైఎస్‌ఆర్ కల్యాణమస్తు పథకం చంద్రన్న పెళ్లి కానుకగా మారింది. వైఎస్‌ఆర్ విద్యోన్నతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా మారుస్తూ ఆదేశాలు ఇచ్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన ఇకపై అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా మారనుంది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకం సివిల్ సర్వీస్ పరీక్ష ప్రోత్సాహకాలుగా కొనసాగనుంది.
ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘నాడు-నేడు’ పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. ఇక నుంచి స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్ (ఎస్ ఐ ఐ) పేరుతో ఆ స్కీమ్‌ను అమలు చేయనుంది. వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ‘ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్’ పథకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా పథకాల మార్పులో పవన్ కల్యాణ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. 2014-19 కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు ఎక్కవగా ఎన్టీఆర్ – చంద్రబాబు పేర్లతో అమలు చేసింది.
పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో పథకాలకు వ్యక్తుల పేర్లు పెట్టటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. మహనీయుల పేర్లు కాకుండా వీరి సొంత మనషుల పేర్లు పథకాలకు పెట్టటం ఏంటని ప్రశ్నించారు. దీంతో, ప్రభుత్వంలో కీలకంగా మారిన పవన్ అభిప్రాయాలకు వీలుగా పథకాల పేర్ల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు పథకాలకే ఎన్టీఆర్ – చంద్రబాబు పేర్లను పరిమితం చేసారు. ఏపీ పేరును ప్రధనంగా హైలైట్ అయ్యేలా పథకాల పేర్లను ఖరారు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మార్పు చేసే పథకాలకు ఎలాంటి పేర్లు ఖరారు చేస్తారో చూడాలి.