
నారద వర్తమాన సమాచారం
తెలుగు మీడియా మొఘల్ రామోజీ మృతి
పత్రికా రంగానికి తీరనిలోటు
– ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా
ఉభయ తెలుగు పాలకులు చర్యలు చేపట్టాలి
గుంటూరు, జూన్ 8:
తెలుగు మీడియా మొఘల్ గా వినుతికెక్కిన ఈనాడు పత్రిక అధిపతి చెరుకూరి రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరనిలోటని సీనియర్ జర్నలిస్ట్, ఉమ్మడి రాష్ట్ర ప్రెస్ అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు నిమ్మరాజు చలపతిరావు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తపరిచారు. అటు పత్రికా, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా రంగాలను వినూత్న రీతిలో తీర్చిదిద్దిన అక్షరయోధుడని నివాళి అర్పించారు. రామోజీ నిష్క్రమణతో తెలుగు పత్రికా రంగం ఒక దిక్సూచిని కోల్పోయినట్లు అయిందన్నారు. తెలుగు పత్రికారంగానికి జవసత్వాలు చేకూర్చేలా వృత్తి విలువలు, ప్రమాణాలు, భాషా నైపుణ్యాల పెంపుదలకు నిరంతరం శ్రమిస్తూ, వేలాదిమంది పాత్రికేయులను పత్రికా లోకానికి అందించిన ఘనత రామోజీకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించిన రామోజీ పేరు చిరస్థాయిగా నిలిచేలా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీకి రామోజీ పేరిట నామకరణం చేయాలని చలపతిరావు సూచించారు.