నారద వర్తమాన సమాచారం
అన్నదాతల నుంచి సేకరించిన వడ్లను మరాడించి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న రైస్‌మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది. గతానికి భిన్నంగా కఠినంగా వ్యవహరిస్తుండటంతో రూ.వందల కోట్ల బకాయిలు వసూలవుతున్నాయి. పలు జిల్లాల్లో మిల్లర్లు తమ వద్ద ధాన్యం లేదంటూ.. బియ్యానికి బదులు డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ జాబితాలోకి గురువారం నాటికి 87 మంది మిల్లర్లు చేరారు. బకాయిల్ని డబ్బు రూపంలో చెల్లించినవారిలో ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 73 మంది ఉన్నారు. నల్గొండ.. ఆరుగురు, యాదాద్రి.. నలుగురు, కరీంనగర్.. ముగ్గురు, సూర్యాపేట జిల్లా నుంచి ఒక మిల్లరు ఉన్నారు. వారంతా రూ.160 కోట్ల నగదును పౌరసరఫరాల శాఖకు చెల్లించారు.
*ఆర్‌ఆర్ యాక్టు అమలుతో సత్ఫలితాలు*
రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్న పౌరసరఫరాల సంస్థ ఆ వడ్లను మిల్లర్లకు సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)కు ఇస్తోంది. ఈ క్రమంలో కొందరు మిల్లర్లు ధాన్యాన్ని, బియ్యాన్ని దారి మళ్లించారు. దీనిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో పౌరసరఫరాల శాఖకు వచ్చిన నష్టాలపై చర్చ జరిగింది. కమిషనర్ డీఎస్‌చౌహాన్ బకాయిల వసూలు విషయంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రెవెన్యూ రికవరీ యాక్టును పటిష్ఠం చేశారు. ఈ చట్టాన్ని ప్రయోగిస్తుండటంతో బకాయిపడ్డ మిల్లర్లు దారికి వస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఓ మిల్లరు బియ్యానికి బదులు బకాయిల్ని రూ.6.55 కోట్ల నగదు రూపంలో చెల్లించారు. పెద్దపల్లిలో ఒకరు రూ.4.01 కోట్లు, యాదాద్రి జిల్లాలో ఇంకొకరు రూ.2.66 కోట్ల నగదు చెల్లించారు. ఆలేరులో ఒకరు రూ.1.60 కోట్లు డిపాజిట్ చేశారు. సూర్యాపేట జిల్లాలో ఒకరు రూ.1.30 కోట్ల బకాయిలకు రూ.50 లక్షలు, రూ.80 లక్షల చొప్పున డిపాజిట్ చేశారు. మానకొండూరులో ఓ మిల్లులో 165.05 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువ ఉంది. ఇందుకు ఆ మిల్లరు రూ.36.69 లక్షలు చెల్లించారు. యాదాద్రి జిల్లాలో ఓ మిల్లరు రెండు దఫాలుగా రూ.1.11 కోట్లు బకాయిలు చెల్లించారు.