నారద వర్తమాన సమాచారం
పెదపట్నం రేషన్ డీలర్ మాయాజాలం
57 బస్తాల బియ్యం హుష్ కాకి
128 ప్యాకెట్ల పంచదార మాయం
చివరికి 6 కిలోల బెల్లాన్నీ వదల్లే
పౌరసరఫరాల శాఖ తనిఖీలో అసలు నిజాలు
కానూరు డీలర్ కు అదనపు బాధ్యత అప్పగింత
మచిలీపట్నం మండలం పెదపట్నంలో రేషన్ షాపు మాయాజాలం బయటపడింది. పౌరసరఫరాల శాఖ అందించిన బియ్యం, పంచదారనే కాదు… ఆఖరికి బెల్లాన్నీ ఊడ్చే పనిలో డీలర్ దొరికిపోయాడు. రేసన్ కార్డుల ఆధారంగా లబ్ధిదారులకు బియ్యం, పంచదార, బెల్లం పంపిస్తే… మన డీలర్ ఎంచక్కా .. దొడ్డిదారిన పంపించి సొమ్ము చేసుకొంటున్నారని అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రంగంలోకి దిగారు. తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అంతే గురువారం ఉదయం 12 గంటలకు పెద్దపట్టణం గ్రామంలోని 637001 రేషన్ షాపును పీడీఎస్ డిప్యూటీ తాసిల్దార్ కే. సుభాన్ బీ , మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎం. యాకూబ్, వీఆర్వో ఎల్ , గణేష్ కలసి పెద్దపట్నం రేషన్ షాప్ నెంబర్ 1 తనిఖీ చేశారు. పీడీఎస్ రికార్డుల ప్రకారం ఇరవై ఎనిమిదిన్నర క్వింటాళ్ల (57 బస్తాల) బియ్యం, 128 పంచదార ప్యాకెట్లు (64 కిలోలు) 6 కిలోల బెల్లం మాయమైనట్టు లెక్కలు తేలాయి. స్టాక్ ను పరిశీలించిన అధికారులు అలాట్మెంట్ కంటే తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ ఆ షాపును సీజ్ చేసి… కానూరు గ్రామంలోని 637002 రేషన్ షాప్ డీలర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.