ఇప్పటికే ఎన్నో రోగాలు పుట్టుకొచ్చి మానవాళిని ఇబ్బంది పెడుతున్నాయి. మూడేళ్ల పాటు కరోనా చేసిన అల్లోకల్లోలం అంతా ఇంతా కాదు. ఇప్పుడు కొత్త అధ్యయనంలో మరొక విషయం తేలింది.
వచ్చే పాతికేళ్లలో అంటే 2050 కల్లా 100 కోట్ల మందికి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ అధ్యయనం వివరాలను రుమటాలజీ జర్నల్లో ప్రచురించారు. ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 59 కోట్ల మంది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2050 కల్లా రెట్టింపు అవుతుంది. 100 కోట్లను దాటే అవకాశం ఉంది.
1990లో కేవలం పాతికకోట్ల మంది మాత్రమే ఇలాంటి వ్యాధి బారిన పడ్డారు. ఇప్పుడు దానికి రెట్టింపు వ్యక్తులు ఆ వ్యాధితో బాధపడుతున్నారు. మరొక పాతికేళ్లలో ఈ ఆస్టియోఆర్థరైటిస్ 100 కోట్ల మందిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పాతికేళ్లలో ఎలాంటి మార్పులు జరగడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ పెరిగే అవకాశం ఉందో అధ్యయనం వివరించింది. ప్రపంచ జనాభా పెరిగిపోవడంతో పాటు వృద్ధుల సంఖ్య కూడా త్వరలో పెరగబోతుంది. ఇక ఊబకాయం బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. వృద్ధాప్యం వంటివి ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడే అవకాశాలను పెంచుతాయి. కేవలం ఊబకాయం కారణంగానే 20 శాతం మందిలో ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినట్టు పరిశోధనకర్తలు.
మహిళల్లోనే ఎక్కువ
మగవారితో పోలిస్తే మహిళల్లోనే ఈ వ్యాధి అధికంగా వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆస్టియో ఆర్థరైటిస్ బాధితుల్లో 61 శాతం మంది మహిళలే. వారికే ఈ వ్యాధి ఎందుకు ఎక్కువగా వస్తుంది? ఎందుకంటే వారిలోనే హార్మోన్ల మార్పులు అధికంగా ఉంటాయి. అలాగే శరీర నిర్మాణంలో కూడా తేడాలు వస్తాయి. బిడ్డ పుట్టిన తర్వాత ఒకలా, పుట్టక పుట్టకముందు ఒకలా వారి శరీర నిర్మాణం ఉంటుంది. అలాగే ఇది వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ను వాడుక భాషలో జాయింట్ డిసీజ్ అంటారు. ఇది కీళ్ళను చాలా ఇబ్బంది పెడుతుంది. కీళ్ల నొప్పి వల్ల నడవలేకపోవడం, పనులు చేయకపోవడం వంటివి జరుగుతాయి. ఇది హఠాత్తుగా వచ్చే వ్యాధి కాదు. కొన్నేళ్లపాటు మొదలై నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది.
ఆర్థరైటిస్‌ను ముందు నుంచే అడ్డుకోవడం చాలా ముఖ్యం. ఊబకాయం బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవాలి. తాజా ఆహారాన్ని తినాలి. మసాలాలు, కారం వంటివి దట్టించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. మీరు తినే ఆహారంలో పండ్లు, తాజా కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దానివల్ల ఇలాంటి ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వ్యాధులు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజూ గంటసేపు నడవడం వల్ల శరీరం శక్తిని పుంజుకుంటుంది. ఎలాంటి వ్యాధులను అయినా తట్టుకునే శక్తి వస్తుంది. ఇప్పటినుంచే మీరు ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడకుండా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం.