- కిడ్నాపర్ అనుకుని విచక్షణారహితంగా దాడి
- దెబ్బలు తాళలేక చనిపోయిన పశువుల కాపరి
- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అమానుషం
అమాయకుడిని కిడ్నాపర్‌గా అనుమానించారు.అతడు చెప్పేది వినకుండా దారుణంగా కొట్టి చంపారు. పశువుల కాపరిపై ప్రతాపం చూపి ప్రాణం తీసిన అమానుష ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..
నిజామాబాద్ మండల పరిధిలోని ఖానాపూర్‌కు చెందిన రాజు (50) కాపరి పశువులను మేతకు వదిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతుంటాడు. సోమవారం ఉదయం రాజు గాయత్రీనగర్ కాలనీకి వెళ్లాడు. అతడి వేషధారణ చూసి పిల్లలను కిడ్నాప్ చేసేందుకు వచ్చాడని స్థానికులు అనుమానించి దాడి చేయడంతో స్పృహ కోల్పోయాడు.
నిందితులపై కేసు నమోదు
డ్రెయినేజీలు తీసే కర్రలతో అతడ్ని లాక్కెళ్తుండగా చేతులు విరిగిపోయాయి. దాడి గురించి సమాచారం అందుకున్న ఫోర్త్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడ్ని దవాఖానకు తరలించారు. కానీ అప్పటికే రాజు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితుడిని చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటి ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.