
ఇంటర్ ఫలితాల్లో ఏర్పడిన సాంకేతిక లోపాలను సవరించి , ఉచితంగా రివాల్యువేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఎబివిపి పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఊషణ అన్వేష్ మాట్లాడుతూ… కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన తెరాస సర్కారు నేడు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాల్లో గందరగోళంతో లక్షల మంది విద్యార్థుల మానసిక క్షోభకు,ఆత్మహత్యలకు కారణమైందన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహణలో కేవలం ప్రకటనలకే పరిమితమై విద్యార్థులకు క్లాసులు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ పూర్తి చేయకుండానే ఆకస్మికంగా పరీక్షలు నిర్వహించడంతో అయోమయంతో విద్యార్థులు గందరగొళానికి గురై నష్టపోయారన్నారు. మునుపెన్నడూ లేనంతగా కేవలం 49% శాతం ఉత్తీర్ణత సాధించడం, ప్రతిభ కలిగిన అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అయిన పరిస్థితి గమనిస్తే పేపర్ వాల్యుయేషన్, అదేవిధంగా సాంకేతిక పరమైన లోపాలున్నట్లు స్పష్టమవుతుందని అన్నారు. పేపర్ వాల్యుయేషన్ లో జరిగిన అవకతవకల వల్ల విద్యార్థులు నష్టపోయి ఆందోళనలో ఉన్నారని కావున విద్యార్థులందరికి మరోసారి ఉచితంగా రీవాల్యుయేట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వేల మంది విద్యార్థులు సింగల్ డిజిట్ మార్కులకే పరిమితమాయ్యరంటే గతంలో జరిగిన విధంగానే మరోసారి సాంకేతిక లోపాలున్నట్లు లోపాలు స్పష్టమవుతున్నందున ప్రభుత్వం మరోసారి ఫలితాలను పునః పరిశీలించి పారదర్శకంగా ఫలితాలు ప్రకటించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఫలితాల విడుదలకు ముందే ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఉత్తీర్ణతా శాతం పై సమాచారం ఉన్నప్పటికీ విద్యార్థులను ఫలితాలకనుగుణంగా సిద్ధం చేయకుండా కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. విద్యార్థులు ఉద్వేగానికి లోను కాకుండా దైర్యంగా ఉండాలని,ఫలితాలల్లో జరిగిన లోపాలను సరిచేసేంత వరకు ఏబీవీపీ విద్యార్థుల పక్షాన నిలుస్తుందని విద్యార్థులకు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ కోడి అజయ్,నగర కార్యదర్శి మారం సందీప్,జిల్లా హాస్టల్స్ కన్వీనర్ ఓమెష్, జోనల్ ఇంచార్జీ బండి రాజశేఖర్, సాయితేజ,రమ్య,మహాలక్ష్మి, భవాని,శిరీష,తాళ్లపల్లి సాయి,జయంత్,సాగర్ తదితరులు పాల్గొన్నారు.