ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షులు కోట్నక్ గణపతి* డిమాండ్
రిపబ్లిక్ హిందూస్ధాన్,తిర్యాణి: కుంరం భీం – ఆసిఫాబాద్ జిల్లా అటవీ భూములలో ఆదివాసీలకు వ్యక్తిగత ఉమ్మడి సామాజిక వనరుల వినియోగం విషయంలో, వ్యవసాయం సేద్యం చేయడం, చిన్న తరహా అటవీ ఉత్పత్తుల, చేపల పెంపకం, చెరువులు, కుంటల వినియోగం, పశువులు మేపుకోవడం, వన మూలికలు సేకరణ, మేధో సంపత్తి కూడిన హక్కులతో, జాతరలు, పండుగలు నిర్వహించుకునే ప్రాంతాలపై హక్కులతో పాటు ఇతర సంప్రదాయ హక్కులను ఆదివాసులు అటవీ హక్కుల చట్టం -2006 ప్రకారం కలిగి వున్నారని ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షులు కోట్నక్ గణపతి పేర్కొన్నారు.
అన్ని రకాల హక్కులనూ అధికారులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తిర్యాని మండలంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మరియు అధికారులు అటవీ హక్కుల కల్పన విషయంలో సరైనరీతిలో పనిచేయక పోవడం వలన సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు. ఆదివాసీలకు వున్న హక్కులను కల్పించకుండా, అధికారులు కేవలం పోడు భూమి మాత్రమే హక్కులు అనే విధంగా ప్రచారం చేస్తుందని, ఆదివాసులకి అటవి హక్కుల చట్టం ప్రకారం కలిగినటువంటి హక్కుల పూర్తీ స్ధాయిలో హక్కులు కల్పించకుండా.. అటవి ప్రాంతం వెళ్లేగొట్టే విధానం సరైనది కాదని, అసలు ఆదివాసీలు నివసిస్తున్న అటవీ భూమిని.. రెవిన్యూ గ్రామం గా గుర్తించాల్సి వున్న అధికారులు, ప్రభుత్వము అందుకొరకు కృషి చేయడం లేదని అన్నారు . అటవీ హక్కుల చట్ట ప్రకారం అర్హులైన వారి వద్ద నుంచి నుంచి దరఖాస్తులను ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే విధంగా సాంకేతికతను వ్యవస్థను రూపొందించాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం పేసా గ్రామ సభల యొక్క సమన్వయంతో పని చేసే విధంగా ప్రతి ఒక్క ఆదివాసి గ్రామాలలో అడవి హక్కుల కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అటవీ హకుల కమిటీలకు, గ్రామసభలు అవసరమైన రిజిస్టర్లు, మినిట్స్ పుస్తకాలు, ఇతర సామాగ్రి తో పాటు అటవీ హక్కుల కొరకు రూపొందించిన ఫామ్ ఏ,బి,సి దరఖాస్తులకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా అందించాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో అటవీ హక్కుల కమిటీలు, గ్రామ సభలు, జీవవైవిద్య కమిటీల యొక్క బాధ్యతలు, వ్యక్తిగత, ఉమ్మడి హక్కులు పొందే విధానం పైన అన్ని గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం, హక్కులను నిర్ధారణ చేయుటకు చేసేటువంటి సర్వేల యొక్క సమాచారం ముందుగానే గ్రామసభలు తెలియజేసి, ఆదివాసీలకు అన్యాయం జరగకుండా చూడాలని , అంతేకాకుండా మండల స్థాయిలో అటవీ హక్కుల కల్పనలో కమిటీని ఏర్పాటు చేసి ఆ యొక్క కమిటీలో స్థానిక ఆదివాసీ సంఘలనూ భాగస్వామ్యం చేయాలని కోరారు. ఆదివాసీ సంఘాలతో అధికారులు ఐటీడీఏ లలో అటవీ భూముల పై హక్కుల విషయంలో సమావేశం నిర్వహించాలని అన్నారు. ఆదివాసీలు విద్యార్థులు, యువత, గ్రామ పెద్దలు, అందరూ కూడా ఆదివాసీలకు ఉన్నటువంటి హక్కుల పైన అవగాహన కలిగి ఉండి, వ్యక్తిగత, సంప్రదాయ, సామూహిక హక్కులకు హక్కు పాత్రలు పొందటానికి.. అటవి హక్కుల కమిటీ యొక్క నిర్ధారణతో గ్రామసభ యొక్క ఆమోదం ద్వారా, గ్రామాలలో వారు ఆమోదించినటు వంటి దరఖాస్తులనూ సబ్ కమిటీకి అందజేసి, హక్కు పత్రాలు పొందుట కొరకు సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన తిర్యాణి మండల నాయకులు ఉయిక గోవింద్ రాయిసిడం దిందర్శ, పర్చకి ఇస్రూ,వేడ్మ మమాత , వల్క రాధ, కోట్నక్ జంగు బాయి, తదితరులు పాల్గొన్నారు..