ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. షెడ్యూల్ విడుదల కావడానికి ఎంతో సమయం లేదు. దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకూ మార్చి మూడో వారంలో షెడ్యూల్ విడుదల కావడం దాదాపుగా ఖాయమైంది.
గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో అటు ప్రచార వేడీ పెరిగింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం, దాని మిత్రపక్షం జనసేన.. ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఆరు విడతల్లో పలు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులనూ ఖరారు చేసింది. టీడీపీ-జనసేన ఇంకా అభ్యర్థుల ఖరారుపై మల్లగుల్లాలు పడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్.. కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల విధుల్లో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను వినియోగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నో అబ్జెక్షన్.. ఉత్తర్వులను జారీ చేశారు. కొన్ని షరతులను విధించారు.
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను పోలింగ్ ఆఫీసర్‌కు అసిస్టెంట్‌గా నియమించాల్సి ఉంటుంది. మిస్లేనియస్ పనులు అంటే- ఓటరు వేలిపై ఇంకును పూయడం, ఇతర పనుల కోసం మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు లోబడి ఇతర ఎన్నికల పనుల కోసం వారి సేవలను తీసుకోవచ్చు.
ప్రతి పోలింగ్ సిబ్బంది పార్టీకి ఒక్క గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగిని మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులను బూత్ స్థాయి అధికారిగా నియమించకూడదు. గ్రామ/వార్డు వలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలి. పోలింగ్ ఏజెంట్లుగా మొదలుకుని ఎలాంటి ఎన్నికల విధుల్లో వారు పాల్గొనకూడదు.