ఏపీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప్లూ వ్యాప్తి కారణంగా పలు చోట్ల కోళ్లు మృత్యువాత పడటంతో ఈ ఆందోళన మరింత పెరిగింది.
ఇతర జిల్లాలకూ ఫ్లూ వ్యాప్తి చెందిందన్న వార్తలు రైతులతో పాటు చికెన్ వినియోగదారుల్ని సైతం కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వార్తలపై స్పందించింది. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ తాజా పరిస్ధితిపై ప్రకటన విడుదల చేసింది.
ఇందులో నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం చాటగొట్ల, కోవూరు మండలం గుబ్బలదిబ్బ గ్రామాల్లో కోళ్లు చనిపోతున్నట్లు తెలియగానే భోపాల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపామని ప్రభుత్వం వెల్లడించింది. పరీక్షల్లో ఇది ఏవియన్ ఇన్ ఫ్లూయెంజ్ (ఏవియన్ ఫ్లూ)గా తేలిందన్నారు. దీంతో చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతుల్లో ఖననం చేశామని వెల్లడించింది. కోళ్లు చనిపోయిన గ్రామాలకు కిలోమీటర్ దూరంలో ఇన్పెక్టెడ్ జోన్ గా ప్రకటించామని తెలిపింది.
నెల్లూరు జిల్లాలో కోళ్లు చనిపోయిన గ్రామాలకు 10 కిలోమీటర్ల దూరాన్ని సర్వైలెన్స్ జోన్ గా ప్రకటించి కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రాకపోకల్ని నియంత్రించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా నెల్లూరు జిల్లాలో ఎలాంటి కోళ్ల మరణాలు చోటు చేసుకోలేదని వెల్లడించింది. అలాగే నెల్లూరు జిల్లాతో పాటు కోళ్ల పెంపకాలు ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి, కృష్ణా, కడప, ప్రకాశం,అనంతపురం జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేసి పరిస్దితిని సమీక్షిస్తున్నట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఎక్కడా కోళ్ల మరణాలు చోటు చేసుకోలేదని పేర్కొంది.
రాష్ట్రంలో కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వ్యాప్తి లేదని, పరిస్దితి పూర్తిగా అదుపులో ఉందని పశుసంవర్ధక శాఖ ప్రకటనలో తెలిపింది. అయినా రైతులకు ఏదైనా అనుమానం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1962కు ఫోన్ లో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.