సాధారణంగా మత్తుమందు ఇచ్చి.. శరీరంలో మత్తు పంపించి ఆపరేషన్ చేస్తారు. ఈ ప్రక్రియలో మత్తు వైద్యుడు కూడా కీలకం. కానీ ఓ వ్యక్తిని కనీసం మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేశారు.
ఇందుకు జగన్ బొమ్మను వినియోగించుకున్నారు. జగన్ ప్రమాణస్వీకారం వీడియోను చూపించి ఆపరేషన్ చేశారు. వింతగా ఉంది కదూ. మీరు వింటున్నది నిజమే. ఫిట్స్ తో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆపరేషన్ చేసే క్రమంలో ఈ ఆసక్తికరమైన పరిణామం బయటపడింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ప్రకాశం జిల్లా ఇసుక త్రిపుర వరానికి చెందిన ఆంజనేయులకు ఏపీ సీఎం జగన్ అంటే వల్లమాలిన అభిమానం. జగన్ కు ఆయన వీరాభిమాని. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆయన ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన మెదడులో 7 cm సైజులో ట్యూమర్ ఏర్పడినట్లు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ అవసరమని చెప్పారు. దీంతో ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించాడు. అయితే ఆ కణితి సున్నిత భాగంలో ఉండడంతో మత్తుమందు ఇస్తే ప్రమాదమని వైద్యులు భావించారు. నీకు ఇష్టమైన నాయకుడు ఎవరని వైద్యులు అడిగారు. నాకు సీఎం జగన్ అంటే అభిమానమని.. హీరో కృష్ణ అన్న తనకు ఎంతో ఇష్టమని.. ఆయన నటించిన అగ్నిపర్వతం సినిమాను ఎన్నోసార్లు చూశానని చెప్పుకొచ్చాడు.దీంతో డాక్టర్లు ఆలోచన చేశారు.
మత్తుమందు ఇవ్వకుండా ఆపరేషన్ చేయడం కుదరదు. అలాగని మత్తు ఇస్తే ప్రాణానికి ప్రమాదం. అందుకే వైద్యులు కొత్త ఆలోచన చేశారు. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో దృశ్యాలను, కృష్ణ నటించిన అగ్నిపర్వతం సినిమాను లాప్ టాప్ లో ప్రదర్శించారు. దానిని చూపించి ఆపరేషన్ పూర్తి చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని వైద్యులే స్వయంగా ధ్రువీకరించారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సరిగ్గా ఎన్నికల ముంగిట ఇటువంటి వార్త వైసీపీ సోషల్ మీడియాకు ఒక వరంగా మారింది. తెగ ట్రోల్ చేస్తున్నారు. వైఎస్ జగన్ మేనియా ఇది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.