Saturday, April 12, 2025
Homeఆంధ్రప్రదేశ్నా కోసం రెండు బటన్‌లు నొక్కండి... వైఎస్ జగన్

నా కోసం రెండు బటన్‌లు నొక్కండి… వైఎస్ జగన్

చంద్రబాబు ఓ చంద్రముఖి! పేదల రక్తం తాగేందుకు ”లక లక” అంటుందన్న జగన్ “57 నెలల్లో మీ బిడ్డ మీ మంచి కోసం 124 సార్లు బటన్‌ నొక్కాడు. ఈ మంచి ఇలాగే జరగాలంటే.. నా కోసం రెండు బటన్‌లు నొక్కండి. ఒకటి ఎమ్మెల్యే ఎన్నికల కోసం..

రెండోది పార్లమెంట్‌ ఎన్నికల కోసం. లేకుంటే.. గత ఎన్నికల్లో ఓటుతో మీరు పెట్టెలో బంధించిన చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. సైకిల్‌ ఎక్కి టీ గ్లాస్‌ పట్టుకుని పేదల రక్తం తాగేందుకు ”లక లక” అంటూ ప్రతీ ఇంటింటికి వస్తుంది. అబద్ధాలతో, మోసాలతో ఓ డ్రాక్యులా మాదిరి తలుపు తట్టి ప్రజల రక్తం తాగుతుంది. 2024 ఎన్నికల్లో జగనన్నకు ఓటేస్తే.. ఆ చంద్రముఖి బెడద ఇక మీకు శాశ్వతంగా ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు” అన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

చంద్రబాబుపై యుద్ధానికి మీరు సిద్ధమా?

“చంద్రబాబు అండ్‌ కోపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?. గత పదిహేనేళ్లుగా ఈ యుద్ధం నాకు అలవాటే. నాతో నడుస్తున్న మీకు అలవాటై ఉంటుంది. చంద్రబాబుకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. చంద్రబాబుకు ఇప్పుడు ఎన్టీఆర్‌ గుర్తొచ్చారు. ఎన్నికలు ఎప్పుడొస్తే.. అప్పుడే ఎన్టీఆర్‌ గుర్తొస్తాడు. రా కదలి రా అంటూ ప్రజలను కాదు.. పార్టీలను పిలుస్తున్నాడు. ప్యాకేజీ కోసం రమ్మని దత్తపుత్రుడిని, మరో పార్టీలో ఉన్న వదినమ్మను రా కదలి రా అని పిలుస్తున్నారు” అని నిప్పులు చెరిగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

“సైకిల్‌ను తొక్కడానికి ఇద్దరినీ.. తోయడానికి మరో ఇద్దరినీ తెచ్చుకున్నారు. పార్టీని విడగొట్టిన ద్రోహుల్ని నాలుగు ఓట్లు విడదీసేందుకు రమ్మంటున్నాడు. బాబుకి, దత్తపుత్రుడికి, వదినమ్మకు సంబంధం ఏంటి?. చంద్రబాబు అండ్‌ కో నాన్‌రెసిడెంట్‌ ఆంధ్రాస్‌. ప్రజలతో పని పడినప్పుడే వీళ్లకు రాష్ట్రం గుర్తుకు వస్తుంది. పొత్తు లేకుంటే పోటీ చేయడానికి 175 స్థానాల్లో చంద్రబాబుకు అభ్యర్థులు లేరు. దిగజారిన పార్టీలు జగనన్నను టార్గెట్‌ చేశాయి” అన్నారు వైఎస్ జగన్.

ఏపీలో వైసీపీని, తనను ఓడించడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌తో పాటు తోడెళ్లందరూ ఏకమయ్యారని సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. దుష్ట చతుష్టయాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరు లో శనివారం నిర్వహించిన ‘ సిద్ధం’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

పెత్తందారులు ఎవరిపై దాడి చేస్తున్నారో ఆలోచించాలని సూచించారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి పైనే ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయని ఆరోపించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజలకు మేలేమి చేయలేదని విమర్శించారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించామన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుందన్నారు. చంద్రబాబు పాలనకు, జగన్‌ పాలనకు తేడాను గమనించాలని కోరారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2.13 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.

ప్రజల రక్షణ కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ. జగనన్నకు మోసం చేసే అవాటు లేదు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్‌ 175 ఎమ్మెల్యే సీట్లు.. 25 ఎంపీ సీట్లు. కాబట్టి మనకు ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా తగ్గకూడదు. 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మీరంతా సిద్ధమా? అని సీఎం జగన్‌ పార్టీ కేడర్‌ ను ఉద్దేశించి అడిగారు. వచ్చే ఎన్నికలకు అందరూ సిద్దంగా ఉండాలన్నారు వైఎస్ జగన్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?