జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లి గ్రామ మూడో వార్డు కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ఇనుప రాడుతో ముగ్గురిపై దాడికి దిగగా ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కౌన్సిలర్ రవీందర్ గ్రామంలోని సర్వే నెంబర్ 407 లో అక్రమ నిర్మాణం చేపడుతూ, బోర్ వేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన మర్రి మల్లికార్జున్, కొలకాని రవిప్రసాద్, మేడిపల్లి రమేష్ అనే ముగ్గురు వ్యక్తులు మీడియాతో మాట్లాడుతుండగా, అక్కడే ఉన్న కౌన్సిలర్ రవీందర్ ఇనుప రాడుతో ఒక్కసారిగా ముగ్గురిపై దాడికి దిగాడు.
దీంతో మర్రి మల్లికార్జున్ అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కౌన్సిలర్ ప్రస్తుతం పనులు చేపడుతున్న స్థలంలో ప్రభుత్వ భూమి ఉన్నదని, అయితే 2014లో ప్రస్తుత కౌన్సిలర్ భార్య సర్పంచ్ గా ఉన్న సమయంలో ఇదే స్థలంలో ఇంటి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నాడని, తిరిగి ఇప్పుడు ఆ భూమి తాను కొనుగోలు చేశానంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అక్రమ నిర్మాణానికి పాల్పడ్డాడంటూ బాధితులు తెలిపారు. ప్రభుత్వ భూమిలో పనులు ఎందుకు చేపడుతున్నావని ప్రశ్నించినందుకు తమపై దాడి చేశాడని బాధితులు పేర్కొన్నారు.
కాగా ఈ విషయంపై కౌన్సిలర్ రవీందర్ ను వివరణ కోరగా తాను కొనుగోలు చేసిన స్థలంలో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తనపై అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. కాగా దాడికి గురైన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు కౌన్సిలర్ రవిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే కౌన్సిలర్ రవీందర్ రాడుతో దాడికి పాల్పడ్డా వీడియో వైరల్ కావడంతో రామన్న పల్లి గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.