- – ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి…
- – బారా, మీటర్ కట్టింగ్ వ్యాపారులపై నిఘా ….
- – అధిక వడ్డీల పేరుతో ప్రజలను వేధించే వారిపై చర్యలు తప్పవు…
రిపబ్లిక్ హిందూస్థాన్, నల్లగొండ : జిల్లాలో అధిక వడ్డీ, బారా, మీటర్ కట్టింగ్ వ్యాపారులపై నిఘా పెట్టడం జరిగిందని, వడ్డీ వేధింపుల విషయంలో బాధితులు నేరుగా తనకు సమచారం ఇవ్వాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ ప్రజలను కోరారు.
జిల్లాలో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మితిమీరిన వడ్డీల వసూళ్లు, లాక్ డౌన్ ఈ.ఎం.ఐ.ల పేరుతో బాదుతున్న చక్రవడ్డీలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా వడ్డీ వ్యాపారుల వేధింపులు, అధిక వడ్డిలు వసూలు చేస్తున్న వారి వివరాలు, బారా కట్టింగ్, మీటర్ కట్టింగ్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే నేరుగా తన ఫోన్ నెంబర్ 9440795600 కు మేజెస్, వాట్స్ అప్ ద్వారా సమాచారం ఇవ్వాలని, నేరుగా తనను కలిసి సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని ఆయన తెలిపారు.
ముఖ్యంగా మిర్యాలగూడ ప్రాంతంలో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులు అధిక వడ్డిలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని దీనిపై విచారణ చేస్తున్నామని, మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన బాధితులు ఎవరైనా తమకు సమాచారం, ఫిర్యాదు చేస్తే వెంటనే అలాంటి వ్యక్తులపై తక్షణం చర్యలు తీసుకుంటామని డిఐజి రంగనాధ్ తెలిపారు.
అధిక వడ్డీల కారణంగా జిల్లాలో సర్వం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అయినప్పటికీ సామాన్య ప్రజల అవసరాలు, వారి నిస్సహాయతలను వారికి అనుకూలంగా మార్చుకుంటూ వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ వారిని పీడిస్తున్న సంఘటనల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారుల పట్ల నిఘా పెట్టినట్లు తెలిపారు. అదే సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టీలు నడిపే వారిపట్ల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ అసాంఘిక కార్యకలాపాలు, బెట్టింగ్స్, అధిక వడ్డీ వ్యాపారులు, అక్రమ వ్యాపారం నిర్వహించే వారి పట్ల నిఘా పెట్టడం జరిగిందన్నారు. రిజిస్టర్ చిట్టీలు కాకుండా జీరో చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడే వారి పట్ల, నిబంధనలు పాటించకుండా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని డిఐజి రంగనాధ్ హెచ్చరించారు.
ఇలాంటి వ్యాపారుల కారణంగా ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులకు గురై మానసికంగా వత్తిడులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు.