🔶 జోరుగా మట్టి దందా
🔶 యదేచ్చగా అక్రమ రవాణా
రిపబ్లిక్ హిందుస్తాన్, నల్లబెల్లి:
మట్టి తవ్వకాలకు కాదేది అనర్హం అంటున్నారు అక్రమార్కులు. ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు చేపట్టి.. దూరప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జల వనరులను జెసిబిలతో యదేచ్చగా తవ్వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమార్కులు మట్టిని దోచేస్తున్నారు. కొన్నిచోట్ల అనుమతులు లేకుండానే పరిమితి కంటే అధిక మొత్తంలో తవ్వేసి తరలిస్తుండటం గమనార్హం. డిమాండ్ బట్టి ఒక్కో చోట ఒక్కో ధరతో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుని జేబుల్లో వేసుకుంటున్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని మద్దెల వాగులో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో అక్రమార్కులు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. వాగులో నుంచి మట్టి తరలించడం వలన వర్షాకాలం వచ్చినప్పుడల్లా తమ పంట పొలాలు ధ్వంసమవుతున్నాయని పక్కనున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.