రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇంటర్నేషనల్ :
అమెరికాలో తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ సాయంతో మరణశిక్షను అమలు చేశారు. ఓ హత్యకేసులో కెన్నెత్ యూజీన్ స్మిత్(58)కు ఈ శిక్షను అలబామా రాష్ట్రం అమలు చేసింది. మత ప్రబోధకుడి భార్య అయిన ఎలిజబెత్ సెన్నెట్‌ను స్మిత్ 1989లో హత్య చేశాడు. మరణాంతక ఇంజెక్షన్లను ఇవ్వడం ద్వారా మరణశిక్షలను అమలు చేయడం సర్వసాధారణం. దీనికి భిన్నంగా హోమెన్ జైలు అధికారులు తొలిసారిగా నైట్రోజన్ హైపాక్సియాను వినియోగించారు.
అలబామాతో పాటు ఓక్లహామా, మిసిసిపీ రాష్ట్రాలు ఈ పద్ధతిలో మరణశిక్షల అమలుకు ఆమోదం తెలిపాయి. చివరిసారిగా 1999లో అమెరికాలో మరణశిక్ష అమలైంది. ఈ శిక్ష అమలులో దోషి బలవంతంగా నైట్రోజన్ హైపాక్సియా వాయువునే పీల్చాల్సి ఉంటుంది. మన శరీరంలో జీవక్రియ సాగాలంటే ఆక్సిజన్ అవసరం. అయితే ఆక్సిజన్‌కు బదులుగా నైట్రోజన్ హైపాక్సియాను మాత్రమే పీల్చడం ద్వారా మరణం సంభవిస్తుంది. ఇది చాలా భయానకంగా ఉంటుంది.
తొలుత దోషికి ఓ రెస్పిరేటర్ మాస్క్ అమర్చి.. దాని ద్వారా ప్రాణాంతక వాయువును 15 నిమిషాల పాటు పంపుతారు. ఊపిరితిత్తుల్లో నైట్రోజన్ హైపాక్సియా నిండిపోవడంతో సెకన్ల వ్యవధిలోనే స్మిత్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. 4 నిమిషాలపాటు అతని ప్రాణం గిజగిజలాడింది. మరో 5 నిమిషాలు శ్వాస భారంగా మారింది. 22 నిమిషాల్లోనే స్మిత్ ప్రాణం విడిచాడు. ఈ శిక్ష అమలును స్వయంగా చూసేందుకు స్మిత్ భార్య, మరో ఐదుగురు జర్నలిస్టులను అనుమతించారు.
గత రెండు దశాబ్దాలుగా అగ్రరాజ్యంలో మరణశిక్షల అమలు తగ్గుతూ వచ్చాయి. 1999లో అత్యధికంగా 98 మంది మరణశిక్ష అమలైంది. నిరుడు ఆ శిక్షల అమలు దాదాపు ఐదో వంతుకు పడిపోయింది. ఉరి, కాల్చివేత, ఎలక్ట్రిక్ చెయిర్, లెథల్ ఇంజెక్షన్ వంటి వివిధ పద్ధతుల ద్వారా మరణశిక్షలు అమలవుతున్నాయి. నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్ష అమలుపై విమర్శలున్నా.. అలబామా రాష్ట్రం ప్రయోగాత్మకంగా దానిని అమలు చేసింది.