వైసీపీ ఎన్నికల వ్యూహాలు మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒక విధంగా పార్టీ దూకుడు ప్రదర్శిం చింది. కానీ, ఇప్పుడు మరో వ్యూహం వేసింది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలన్న కసితో ఉన్న పార్టీ.. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు రెడీగా లేదు. ఈ క్రమంలో కీలకమైన వలం టీర్ల వ్యవస్థను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. వలంటీర్లు ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము తీసుకుంటున్నారని.. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఇప్పటికే అనేక ఫిర్యాదులు చేశాయి.
దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా.. ఏమాత్రం అనుభవం లేని, ప్రభుత్వ ఉద్యోగులు కాని వలంటీర్లను పక్కన పెట్టాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా అన్ని జిల్లాల అధికారులకు ఇదే ఆదేశాలు జారీ చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వారిని పక్కన పెట్టడం దాదాపు ఖాయమైంది. అయితే.. ఇదే వైసీపీకి మింగుడు పడడం లేదు. ఈ క్రమంలో పూర్తిగా వలంటీర్ల విషయంలో యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే.. వలంటీర్లను ఎన్నికల విధులకు వాడుకునేలా.. ఈ వ్యూహం ఉందని తెలుస్తోంది.
తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం.. వలంటీర్లను రెండు నుంచి మూడు మాసాల పాటు పూర్తి గా సస్పెండ్ చేస్తారు. ఇక, వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు ఉండవు. వారిని ప్రభుత్వం కూడా వినియోగించుకోదు. వారిని పూర్తిస్థాయి పార్టీ కార్యకర్తలుగా ఈ రెండు నుంచి మూడు మాసాల పాటు పరిగణించనున్నారు. తద్వారా.. వారు వైసీపీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేస్తారు. మరి ఈ రెండు
మూడు మాసాలు ఎవరు వారికి జీతాలు ఇస్తారు? అనేది ప్రశ్న. ఇక్కడ కూడా లైన్ క్లియర్ చేసి పెట్టారు.
అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో వైసీపీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులే.. వలంటీర్లకు జీత భత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నుంచి వలంటీర్లకు రూ. 5000 రెమ్యునరేషన్ కింద అందిస్తున్నారు. ఇక, ఎన్నికల సమయంలో 20 వేల నుంచి 25 వేల వరకు పార్టీ అభ్యర్థులు చెల్లించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అంటే.. దాదాపు ఇప్పటి వరకు అందుకుంటున్న వేతనాలకు ఇది నాలుగు రెట్లు ఎక్కువగా ఉండనుంది. తద్వారా.. నియోజకవర్గంలో పట్టు పెంచుకున్న వలంటీర్లను ఇలా ఎన్నికల్లో వినియోగించుకునేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఇబ్బందీ ఉండదని అంచనా వేస్తున్నారు. ఇదీ.. సంగతి..!