◾️ ప్రజల కోసం ప్రాణాలర్పిస్తున్న జిల్లా పోలీసులు
◾️తొమ్మిది మంది అమరవీరుల కుటుంబాలకు మిగిలిన అంతులేని మనోవ్యధ
◾️ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న జిల్లా పోలీసులు
నేడే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21 పై ‘రిపబ్లిక్ హిందుస్థాన్ ” ప్రత్యేక కథనం….
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్న జిల్లా పోలీసులకు గత రెండున్నర, మూడు దశాబ్దాల మధ్య అరాచకాలు సృష్టిస్తున్న మావోయిస్టులే జిల్లా అభివృద్ధికి ప్రజాసంక్షేమానికి ప్రధానమైన అడ్డంకిగా ఉన్న తరుణంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధుల నిర్వహణలో ప్రజా క్షేమం కోసం ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మంది పోలీసులు అమరులైన ఘటనలపై ప్రత్యేక కథనం..
ఎం లక్ష్మణ్, హెడ్ కానిస్టేబుల్-1584 మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటైన స్పెషల్ పార్టీ సభ్యుడు….

1989 సంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న తరుణంలో ఏర్పాటైన స్పెషల్ పార్టీ సాయుధ దళం లో పనిచేస్తున్న అదిలాబాద్ రాంనగర్ కాలనీకి చెందిన లక్ష్మణ్ 1983 సంవత్సరంలో సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. 30 అక్టోబర్ 89 రోజున బంధువుల ఇంట్లో శుభకార్యానికి బజార్హత్నూర్ మండలం పిప్రీ గ్రామానికి వెళ్ళిన ఆయన సమాచారం మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులకు కొరియర్ వ్యవస్థ ద్వారా చేరడంతో మావోయిస్టులు గ్రామంలో ప్రవేశించి అందరూ చూస్తుండగా బహిరంగ ప్రదేశంలో తుపాకితో కాల్చి అతి దారుణంగా హత్య చేశారు. యుక్తవయసులో హత్యకు గురైన లక్ష్మణ్ కు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు దుఃఖసాగరంలో జీవనం కొనసాగిస్తున్నారు.
*రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ ఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళ వీర మరణం*

1991 సంవత్సరంలో ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఉట్నూర్ ఎస్సై బి. కొట్యా నాయక్, ఇద్దరు హెడకానిస్టేబుళ్ళు అయినా తాహెర్ మొహమ్మద్ -394,ఏ గోవర్ధన్ – 1169 మరణం….. విధి నిర్వహణలో ఉండగా కొమ్ముగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు బీడీ ఆకుల కల్లాలు దగ్ధం చేశారని సమాచారం అందుకొని హుటాహుటిన ఘటనా స్థలంకు వెళ్తున్న రహదారిలో మావోయిస్టులు ముందుగానే పోలీసులు వస్తారనే ప్రణాళిక ప్రకారం మాటువేసి మందుపాతరలు పేల్చి అనంతరం తుపాకులతో కాల్పులు జరిపి ముగ్గురిని హత్య చేశారు. ఓకే ఘటనలో ఎస్సైతో సహా ముగ్గురు యువ పోలీస్ అధికారులు వీరమరణం పొందటం రాష్ట్రంలోని సంచలనమైన ఘటనగా చరిత్రపుటల్లో కెక్కింది.


ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్సై కోటియా నాయక్, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన గోవర్ధన్, కోరుట్ల పట్టణానికి చెందిన తాహెర్ మహమ్మద్ కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురై ఇప్పటికీ వారి జ్ఞాపకాల్లోనే జీవనం సాగిస్తున్నారు.
సాగీర్ అహ్మద్, కానిస్టేబుల్-2315 బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్

బజార్హత్నూర్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాగీర్ అహ్మద్, కానిస్టేబుల్-2315 జులై 30న విధినిర్వహణలో మర్లపల్లి గ్రామానికి వెళ్లి ఆయన తిరిగిరాని లోకానికి చేరాడు. మారుమూల గ్రామమైన మర్లపల్లిలో పోలీస్ కానిస్టేబుల్ వచ్చినట్లు మావోయిస్టు యాక్షన్ టీం దళంకు ఉప్పందడంతో గ్రామంలో ప్రవేశించి కానిస్టేబుల్ ను బంధించి, చిత్రహింసలు పెట్టి అనంతరం గ్రామస్తుల సమక్షంలోనే తుపాకితో కాల్చి దారుణంగా హత్య చేశారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఆయన భార్య, పిల్లలు ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడం పట్ల తీవ్రమైన వ్యధతో జీవనం సాగిస్తున్నారు.
సయ్యద్ హమీద్ఉద్దీన్, హెడ్ కానిస్టేబుల్-1041

1996 సంవత్సరంలో బోథ్ పోలీస్ స్టేషన్లో సయ్యద్ హమీద్ఉద్దీన్, హెడ్ కానిస్టేబుల్-1041 గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో జనవరి 17న బోథ్ పట్టణంలో మావోయిస్టు యాక్షన్ టీం దళం సభ్యులు ఆయనను టార్గెట్ చేసి ప్రజలు చూస్తుండగానే తుపాకితో కాల్చి పరారయ్యారు. తీవ్రగాయాలైన ఆయనకు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వీరమరణం పొందాడు. కోరుట్ల పట్టణానికి చెందిన ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఆయన మృతి పట్ల తీరని దుఃఖంలో జీవనం సాగిస్తున్నారు.
ఉర్వతే జానే రావు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్-637

1996 సంవత్సరంలో ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్ లో హెడ్ కానిస్టేబుల్ ఉర్వతే జానే రావు హోదాలో స్పెషల్ పార్టీ లో పని చేస్తూ మావోయిస్టుల ఏరివేత విధుల్లో చురుకుగా పాల్గొనేవాడు. సెప్టెంబర్ 8న గుడిహత్నూర్ నుండి ఆదిలాబాద్ ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణంలో మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుడు తనతో వస్తానని అభ్యర్థన చేయడంతో ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్న అనంతరం మావాల అటవీ ప్రాంతంలో అదును చూసి వెనుకనుండి కత్తితో పొడిచి అతి దారుణంగా హత్య చేసి పారిపోయాడు. ఆదిలాబాద్ రిక్షా కాలనీకి చెందిన ఆయన భార్య, పిల్లలు తీవ్రమైన దుఃఖంతో జీవనం గడుపుతున్నారు.
రాథోడ్ శంకర్, కానిస్టేబుల్-2275

1999 సంవత్సరంలో కానిస్టేబుల్ రాథోడ్ శంకర్ బోథ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో జులై 29న పట్టపగలు సినిమా టాకీస్ వద్ద ఉండగా మావోయిస్టు యాక్షన్ టీం దళ సభ్యులు ప్రజలందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేసి పారిపోయారు. ఆదిలాబాద్ సంజయ్ నగర్ కాలనీకి చెందిన ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఆయన మృతి పట్ల తీవ్రమైన ఆవేదనతో జీవనం కొనసాగిస్తున్నారు.
కె రాజేశ్వర్, కానిస్టేబుల్-2678

1999 సంవత్సరంలో కానిస్టేబుల్ కె రాజేశ్వర్ బోథ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో నవంబర్ 3న సంత విధులకు కౌట గ్రామానికి పోలీస్ జీప్ లో వెళ్తున్న క్రమంలో మావోయిస్టులు మందుపాతరతో జీపును పేల్చివేయడంతో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చడంతో చికిత్స పొందుతూ వీర మరణం పొందారు. నిర్మల్ పట్టణానికి చెందిన ఆయన భార్య, సంధ్యారాణి ఇప్పటికీ అతని జ్ఞాపకాల్లో మానసిక క్షోభకు గురి అవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 1983 ఈ సంవత్సరం నుండి మావోయిస్టుల దుశ్చర్యలకు వివిధ ఘటనలలో 48 మంది పోలీసులు అమరులు కాగా, జిల్లాల విభజన అనంతరం అదిలాబాద్ జిల్లా పరిధిలో 7 ఘటనలో తొమ్మిది మంది పోలీసులు మావోయిస్టులతో పోరాడి వీర మరణం పొందారు.
అమరవీరుల కుటుంబ సభ్యులకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థంలో కట్టడాలు
◾️ అమరవీరుల పేర్లతో పోలీస్ హెడ్ క్వార్టర్ లో పలు భవనాలు
◾️ రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లాలో అమరవీరుల కుటుంబాలకు కాలనీ
విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధీర పోలీసుల జ్ఞాపకార్థం, ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 ను భారతదేశం అంతటా పోలీసు బలగాలు ‘సంస్మరణ దినోత్సవం’ గా జరుపుకుంటారు. అక్టోబర్ 21, 1959న భారత భూభాగంలో జరిగిన అసమాన ఘర్షణలో లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద పది మంది ధైర్యవంతులైన పోలీసులను చైనా సైన్యం మెరుపుదాడి చేసి చంపింది. ఈ పది మంది వీర పోలీసుల జ్ఞాపకార్థం 1962లో జరిగిన DGsP/IGsP కాన్ఫరెన్స్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21ని పోలీసు సంస్మరణ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. రానున్న అక్టోబర్ 21 న ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అమరులైన జవాన్ల జ్ఞాపకార్థం ఫ్లాగ్ డే, అమరవీరుల దినోత్సవం ను నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో గతంలో అమరులైన పోలీసు వీరుల సంస్మరణ సందర్భంగా ఈనెల లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం అదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల అలజడి, ఉగ్రవాద చర్యలు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పి ఉన్నదంటే ఒకప్పటి పోలీసుల త్యాగ ఫలితమే ప్రధాన కారణం. ఒకప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో నిరంతరం మావోయిస్టులు, పోలీసుల మధ్య తరచూ ఎదురుకాల్పులు, రక్తపు మరకలతో అట్టుడిగి పోయేది. జిల్లా అభివృద్ధి కుంటుపడి అనేక సమస్యలతో ప్రజలు సతమతమయ్యేవారు. మావోయిస్టులను జిల్లా నుండి తరిమి వేయడమే పోలీసుల ప్రధానమైన లక్ష్యంగా ఉండేది. అత్యధిక శాతం పోలీసులు అడవుల్లోనే ఉంటూ మావోయిస్టుల ఏరివేతలో గాలింపు చర్యలు చేపట్టుతూ, అడవులను జల్లెడ పడుతూ ఉండేవారు. పల్లె గ్రామాల ప్రజలు ఎప్పుడూ ఏమి జరుగుతుందనే భయం, ఆందోళనతో జీవనం సాగించేవారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఇటు ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుంటూ, మావోయిస్టులపై పట్టు సాధించడానికి అనేక కార్యకలాపాలు చేపట్టేవారు. అప్పటి పోలీసుల ఏకైక లక్ష్యం, ప్రజల కోసం, శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధమయ్యేవారు. రాజ్యాంగ రక్షణకై ప్రజాస్వామ్య పరిరక్షణకై, సమాజ శ్రేయస్సుకై, అహర్నిశలు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉగ్రవాద, తీవ్రవాద చర్యలను ఎదుర్కొంటూ సంఘవిద్రోహ శక్తుల నుండి ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకై ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రాజీలేని పోరాటం చేస్తూ, అసువులు బాసిన అమర వీరులకు ప్రతి ఏటా జిల్లాలో అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) జరుపుకుంటారు.
ఆదిలాబాద్ జిల్లా లో 1989 నుండి 1999 వరకు సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ 9 మంది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీసులు అమరులైనారు.
జిల్లా పోలీసులు ఒక అడుగు ముందుకు వేసి అమరవీరుల దినోత్సవం సందర్భంగానే కాకుండా ప్రతిరోజు అమరవీరుల పేర్లు చలామణిలో ఉండాలనే ఉద్దేశ్యంతో పోలీస్ హెడ్ క్వార్టర్ లో పలు భవనాలకు, ఎన్ కౌంటర్ ఘటనల స్థలం, అమరవీరుల పేర్లతో పిలుస్తుంటారు.
🟥 ఆలంపల్లి కాంప్లెక్స్..
1987 సంవత్సరంలో కడెం మండలం ఆలంపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య భీకరమైన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఎస్సైలతో సహా 11 మంది పోలీసులు తమ ప్రాణాలను అర్పించారు. ఆలంపల్లిలో పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసి మావోయిస్టుల గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో, మావోయిస్టులు పన్నాగంతో పోలీసులను రప్పించి పైశాచికంగా తుపాకులతో కాల్చారు. ఉమ్మడి జిల్లాలో ఇదే అతిపెద్ద ఎన్ కౌంటర్,
ఈ ఘటన జ్ఞాపకార్థం పోలీస్ హెడ్ క్వార్టర్ లో మూడంతస్తుల భవనం నిర్మించి అలంపల్లి కాంప్లెక్స్ గా నామకరణం చేశారు.
🟥 ఎస్సై కోట్యా నాయక్ చిల్డ్రన్ పార్క్
1991 సంవత్సరంలో ఉట్నూర్ ఎస్ఐ కోట్యా నాయక్ మావోయిస్టులతో పోరాడి అసువులు బాశారు. మావోయిస్టులు కుట్రతో ముందుగా కొమ్ము గూడ అటవీ ప్రాంతంలో బీడీ ఆకులు కాలబెట్టి ఇన్ఫార్మర్ తో పోలీసులకు సమాచారం అందించగా అప్పటి ఉట్నూర్ యువ ఎస్సై కోట్యా నాయక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకోవడంతో, రోడ్డుకు ఇరువైపులా పేలుడు పదార్థాలు అమర్చి, కాల్పులు జరిపి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఎస్సైతో పాటు మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అసువులు బాశారు.
🟥 చక్రపాణి మెమోరియల్ హాల్
1993 సంవత్సరంలో మంచిర్యాల్ సీసీసి నస్పూర్ వద్ద మావోయిస్టులు ఓ ఇంట్లో తల దాచుకున్నట్లు సమాచారం తెలుసుకొన్న అప్పటి శ్రీరాంపూర్ సర్కిల్ సీఐ చక్రపాణి తన గన్ మెన్ అశోక్ తో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మావోయిస్టులను అదుపులో తీసుకునే క్రమంలో మావోయిస్టులు ఇంటి పైకప్పు నుండి కాల్పులు జరిపి సీఐ చక్రపాణి, కానిస్టేబుల్ అశోక్ లపై తుపాకులతో కాల్పులు జరిపి హత్య చేశారు. జిల్లాలో మొదటిసారిగా సిఐ స్థాయి అధికారి మావోయిస్టుల దుశ్చర్యతో అమరుడైనఅందుకు పోలీస్ సమావేశ మందిరం నిర్మాణం చేసి ఆయన జ్ఞాపకార్థం “చక్రపాణి మెమోరియల్ హాల్” పేరుతో నామకరణం చేశారు.
🟥 శేషు, సంజీవ్ పేర్లతో వ్యాయామశాల
2000 సంవత్సరంలో బెల్లంపల్లి, మంచిర్యాల్ తదితర సింగరేణి ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాల నిర్వహణ బాధ్యత సికాస సంస్థ చేపట్టేది. మావోయిస్టుల ఏరివేతలో ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు శేషు, సంజీవ్ కీలక పాత్ర పోషించేవారు. మావోయిస్టులు ఇద్దరిని టార్గెట్ చేసి తుపాకులతో కాల్చి హత్య చేశారు. వీరి ఇద్దరి జ్ఞాపకార్థం పోలీస్ హెడ్ క్వార్టర్ లో వ్యాయామశాల నిర్మాణం చేపట్టి నామకరణం చేశారు.
🟥 పోలీస్ అమరవీరుల కాలనీ
2015 సంవత్సరంలో పోలీస్ అమరవీరుల కుటుంబాల కోసం స్థానిక పిట్టల్ వాడా కాలనీలో ఏకంగా కోటి రూపాయల వ్యయంతో 48 మంది కుటుంబాల నివాసం కోసం కాలనీ ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా ఎస్పీలు తరుణ్ జోషి, గజరావు భూపాల్, అదనపు ఎస్పీ టి. పనసారెడ్డి కృషితో స్థలం కేటాయించి, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించి నివాసం కోసం నిర్మాణాలు చేపట్టి, పోలీస్ అమరవీరుల కాలనీగా నామకరణం చేసి ప్రారంభించారు.
పోలీస్ అమరుల కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట : జిల్లా ఎస్పీ
◾️ అమరుల కుటుంబ సభ్యులతో పోలీసు ముఖ్య కార్యాలయంలో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

ఆదిలాబాద్ : పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక గౌరవం ఉంటుందని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లాకు చెందిన 9 మంది అమరవీరుల కుటుంబ సభ్యులకు చెందిన వారితో జిల్లా ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అమరవీరుల కాలనీలో పలు సమస్యలు ఉన్నట్లు తెలియజేయగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలియజేశారు. ప్రస్తుతం జిల్లా ప్రజలు, అందరం కలిసి ప్రశాంత వాతావరనం లో జీవనం సాగిస్తున్న కారణం వెనుక గతంలో మావోయిస్టుల తో పోరాడి ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు వీరులు ఉన్నట్లు తెలియజేశారు.

ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల అలజడితో అభివృద్ధి కొంటుపడి, శాంతి భద్రతల పరిస్థితిగా నాజుగ్గా ఉన్న సమయంలో యోదుల్లా కదిలిన పోలీసు యంత్రాంగం జిల్లా అంతటా అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టి మావోయిస్టులను తరిమి వేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో అనేక మంది పోలీసులు అమూల్యమైన ప్రాణాలను అర్పించినట్లు తెలిపారు. ప్రజల క్షేమం రక్షణ కోసం ప్రాణాలు అర్పించే పోలీసుల త్యాగాలు మరువలేనివని సదాస్మరించుకొని వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, పోలీసు కార్యాలయం పరిపాలన అధికారి మహమ్మద్ యూనస్ అలీ, సిసి దుర్గం శ్రీనివాస్, సెక్షన్ పర్యవేక్షణ అధికారి కుమార్ నాయక్, అదరపు ఎస్పి సిసి గిన్నెల సత్యనారాయణ, అధికారిని లు జె భారతి,జె కవిత, అమరవీరుల కుటుంబ సభ్యులు శివానంద, హీరాబాయి, దూరీబాయి, జె విమల భాయ్ తదితరులు పాల్గొన్నారు.