మన దేశంలో బియ్యం ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే తింటారు. ఉత్తరాదిన గోధుమ పిండితో చేసిన చపాతీలను ఎక్కువగా తింటారు. కానీ బియ్యంతో చేసే అన్నన్ని..మన దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు..
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా తింటారు. బియ్యం ఏ మాత్రం పాడైపోయినా.. మనం పారేస్తాం. మిల్లర్లు కూడా చెత్తకుప్పల్లో వేస్తుంటారు. అలాంటి బియ్యాన్ని మనం అస్సలు తినలేము. కానీ ఉత్తర నైజీరియాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు కుళ్లిన బియ్యాన్ని తింటారు. అవి పూర్తిగా రంగు మారి.. కంపుకొడుతున్నా.. అనారోగ్య సమస్యలు వచ్చినా.. వాటితోనే అన్నం వండుకొని తింటుంటారు. దీనికి కారణమేంటి..?
బిబిసి నివేదిక ప్రకారం.. ఉత్తర నైజీరియాలో ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ద్రవ్యోల్పణం కారణంగా ప్రతి చిన్న వస్తువు రేటు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. బియ్యం, కూరగాయాలు, పప్పు ఉప్పుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంత ధరలకు నిత్యావసర సరులకును కొనే డబ్బు అక్కడి ప్రజల వద్ద లేదు. ఏదో బాగా డబ్బులున్న వారు తప్ప.. పేద, మధ్యతరగతి ప్రజలు బియ్యాన్ని కొనలేకపోతున్నారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రజలు చెడిపోయిన, కుళ్లిపోయిన బియ్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే అవి మాత్రమే తక్కువ ధరకు లభిస్తాయి. కొన్నేళ్ల క్రితం ఇలాంటి బియ్యం వారు తినే వారు కాదు. పాడైపోయిన బియ్యాన్ని పారేసేవారు. కానీ పరిస్థితుల కారణంగా ఇప్పుడు అలాంటి బియ్యాన్నే తినాల్సి వస్తోంది.
నైజీరియా ప్రజలు దీనిని అఫాటా అని పిలుస్తారు. నైజీరియాలో నిత్యావసరాల ధరలు దాదాపు 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వేగంగా పెరుగుతున్నాయి. ఇక్కడ 50 కిలోల బియ్యం ధర రూ.4400కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 70 శాతం అధికం. చాలా మంది నైజీరియన్లు ఒక నెల సంపాదన కూడా అంత ఉండదు. మరి అలాంటప్పుడు బియ్యాన్ని ఎలా కొంటారు? ఎలా తింటారు? అందుకే కుళ్లిన బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి కడుపు నింపుకుంటున్నారు. పాడైపోయిన బియ్యాన్ని తిని.. చాలా మంది అనారోగ్యం బారినపడుతున్నారు. ఐనప్పటికీ బతకాలంటే.. తినక తప్పదని చెబుతున్నారు అక్కడి ప్రజలు.