అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామస్తులు వింత ఆచారం పాటిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు రోజున ఆ గ్రామం మొత్తం ఖాళీ అవుతుంది. గ్రామస్తులతో పాటు మూగజీవాలతో సహా అన్నింటిని తీసుకొని గ్రామాన్ని వీడి అడవిలోకి వెళ్తారు. ఇలా చేయడానికి ప్రధాన కారణం ఉందని గ్రామస్తులు చెప్పారు. ఆధునిక యుగంలోనూ ఇప్పటికి ఇలాంటి వింత ఆచారాలు వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఈ సంప్రదాయాన్ని మాత్రం గ్రామస్తులు ప్రతీయేటా తూచాతప్పకుండా పాటిస్తారు.
మాఘమాసం పౌర్ణమికి ముందు రోజు గ్రామస్తులందరూ గ్రామాన్ని ఖాళీ చేస్తారు. ఇంటికి తాళాలు వేసి, పెట్టాబేడా చదురుకొని, ఇంటిలోని గేదెలనుసైతం తోలుకొని అగ్గిపాడు ఆచారం పేరుతో అడవిలోకి వెళ్తారు. తెల్లవారు జామున సూర్యుడు ఉదయించేలోపు గ్రామం ఖాళీ చేసి గ్రామస్తులు అడవిలోకి వెళ్తారు. మళ్లీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత గ్రామానికి తిరిగి వస్తారు. సంవత్సరంలో మాఘ మాసం పౌర్ణమికి ముందురోజు ఇలా చేస్తే మాగ్రామానికి ఉన్న అరిష్టాలు తొలగిపోయి గ్రామానికి మంచి జరుగుతుందని తలారిచెరువు గ్రామస్తులు చెబుతున్నారు.
అగ్గిపాడు ఆచారం వెనుక పెద్ద చరిత్ర ఉందని గ్రామస్తులు తెలిపారు. 400 సంవత్సరాల క్రితం తలారి చెరువు గ్రామంలో ఓ బ్రాహ్మణుడు తన అనుచరులతో కలిసి దాడిచేసి అందినకాడికి దోచుకెళ్లేవాడట. అతడి ఆగడాలు పెరిపోవటంతో గ్రామస్తులంతా కలిసి బ్రాహ్మణుడిని హతమార్చారు. అప్పటి నుంచి ఊళ్లో పుట్టిన పిల్లలు చనిపోతూ వచ్చారట. బ్రాహ్మణుడిని హత్య చేయడం వల్లనే పిల్లలు చనిపోతున్నారని ఓ జ్యోతిష్యుడు చెప్పాడట. ఇలా జరగకుండా ఉండాలంటే మాఘచతుర్ధశి అర్థరాత్రి నుంచి పౌర్ణమి అర్థరాత్రి వరకు ఆ గ్రామంలో ఎలాంటి అగ్గి, వెలుతూరు లేకుండా గ్రామం వదిలి దక్షిణవైపు వెళ్లాలని సూచించారు. అప్పటి నుంచి జ్యోతిష్యుడి సలహాతో అగ్గిపాడు ఆచారంను గ్రామస్తులు పాటిస్తున్నారు. గ్రామస్తులంతా కుటుంబ సభ్యులు, పశువులను తొలుకొని తలారిచెరువు గ్రామం వదిలి వెళ్తున్నారు. మాఘ చతుర్దశి అర్ధరాత్రి నుంచి మాఘపౌర్ణమి అర్ధరాత్రి వరకు 24గంటల పాటు గ్రామంలో పొయ్యి వెలిగించరు, లైట్లు వెలిగించకుండా ఆచారం కొనసాగిస్తున్నారు. ఆఖరికి ఆటోలు, ఆర్టీసీ బస్సులనుసైతం గ్రామంలోనికి అనుమతించరు. కొత్త వ్యక్తులెవరూ గ్రామంలోకి ప్రవేశించకుండా గ్రామస్తులే కాపలా ఉంటారు.