గణిత మేధావి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇకలేరు
రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్ : జిల్లాకు చెందిన గణిత మేధావి ఇకలేరు. జైనథ్ మండలం పెన్ గంగ నదిలో గల్లంతైన ధర్మేందర్ సింగ్ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ధర్మేందర్ సింగ్ తన మిత్రులతో కలిసి ఈ నెల 26వ తేదీన పెన్ గంగ నదివైపు వెళ్ళారు. అప్పటి వరకు సరదాగా నది ఒడ్డు పై కూర్చొని సంతోషంగా మాట్లాడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కాలనీ వాసులు గత రోజులుగా గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు ఆదివారం జైనథ్ మండలంలోని గ్రామం నదిలో మృతదేహం లభ్యమైంది.
గణిత మేధావిగా…
ధర్మేందర్ సింగ్ ఉపాధ్యాయుడి గానే కాకుండా గణితంలో మేధావిగా, ఏబీవీపీ నాయకుడుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలకు సుపరిచితులు. విద్యారంగం ద్వారా ఎన్నో సెమినార్ లకు హాజరవ్వడమే కాకుండా పదవ తరగతి పాఠ్య పుస్తకాల్లో ఆయన రచించిన రచనలు ముద్రించబడ్డాయి. అటు విద్యార్థి దశలో ఏబీవీపి నాయకునిగా విద్యారంగ సమస్యల పై అనేక పోరాటాలు తలపెట్టిన ఘనత ఆయనది. ప్రస్తుత ఏబీవీపీ నాయకులు నిర్వహించే పలు శిక్షణ తరగతులను సైతం చేయుతనందించే వారు.మరోవైపు మలిదశ తెలంగాణ ఉద్యమంలో సైతం కీలకంగా వ్యవహరించారు. ఆదిలాబాద్ లో ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్న ఉద్యమాల్లో ప్రత్యేక్రంగా పాల్గొని ఉద్యమాలు సైతం చేపట్టారు.
అంతటి మహానుభావుని కోల్పోవడం జిల్లా ప్రజల్లో తీరాన్ని దుఃఖాన్ని మిగిల్చింది. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గణిత మేధావి శాశ్వతంగా సెలవు ప్రకటించారు.
ధర్మేందర్ సింగ్ పార్థివదేహాన్ని ఎస్పీ,డీఈఓ ల నివాళులు..
ధర్మేందర్ సింగ్ స్వగృహంలో ఆయన పార్థివ దేహానికి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, డీఈఓ ప్రణీత, వార్డ్ కౌన్సిలర్ పెనగంటి ప్రకాష్ తో పాటు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఏబీవీపీ నేతలు, కాలనీ వాసులు, పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పలువురు ధర్మేందర్ సింగ్ తో ఉన్న అనుభూతులను నెమరువేసుకున్నారు.
