— ఎస్టియు జిల్లా అధ్యక్షుడు జాదవ్ అశోక్ కుమార్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
తెరాస ప్రభుత్వానికి పదమూడు జిల్లాల భార్యాభర్తల గోడు పట్టదు, పలు నిబంధనలు పెట్టి పరస్పర బదిలీలకు అనుమతించరు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత లేదని ఎస్టియు జిల్లా అధ్యక్షుడు జాదవ్ అశోక్ కుమార్ ప్రభుత్వం పై మండి పడ్డారు. ఈ సందర్బంగా మాట్లాడుతు కోర్టు తీర్పులను ఖాతరు చేయరు, స్పెషల్ కేటగిరీ అప్పీల్స్ పరిష్కారం చేయరు కానీ పలుకుబడి కలిగిన వారికి పైరవీ బదిలీలకు మాత్రం ఏ నిబంధనలు అడ్డురావని అన్నారు.

స్పౌజ్ కు బ్లాక్ చేసిన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు పైరవీ బదిలీల వరద కొనసాగుతోందని, ఇది అన్యాయమని అన్నారు. టిటియు రాష్ట్ర అధ్యక్షుడు మణిపాల్ రెడ్డిని నల్లగొండ నుండి రంగారెడ్డికి నిబంధనలకువిరుద్ధంగా బదిలీ చేశారు. ఇంకా పలువురు పలువురు ఉపాధ్యాయులు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో జాయిన్ అయ్యారు. జిఓ 317 ద్వారా వేలాది మంది స్థానికతను కోల్పోయి బాధపడుతుంటే పట్టించుకోకుండా ఆ జిఓ 317 నే అడ్డం పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా అక్రమ బదిలీలకు తెరలేపడాన్ని ఎస్టియు తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు.
అందరికీ ఒక న్యాయం, అస్మదీయులకు మరో న్యాయం సమంజసం కాదని పేర్కొన్నారు. అక్రమ బదిలీలను రద్దు చేసి అర్హత గలిగిన అందరికీ పారదర్శకంగా సాధారణ బదిలీలు నిర్వహించాలని ఎస్టియు అదిలాబాద్ జిల్లా డిమాండ్ చేస్తున్నదని అన్నారు.