ఇది సీన్‌కు ఏ మాత్రం తీసిపోదు. తవ్వకాలలో బయటపడిన మొఘల్ కాలం నాటి బంగారు, వెండి నాణేల నిధితో ఓ కాంట్రాక్టర్ ఎస్కేప్ అయ్యాడు. ప్రజంట్ అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఈ ఘటన సంభాల్ జిల్లాలోని జున్‌వై ప్రాంతంలోని హరగోవింద్‌పూర్ గ్రామంలో వెలుగు చూసింది. గ్రామపెద్ద కమలేష్ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం కోసం తవ్వకం పనులు జరుపుతున్నారు. రోడ్డు కోసం కావాల్సిన మట్టిని… లాహ్రా నాగ్లా శ్యామ్ ప్రాంతానికి చెందిన మణిరామ్‌సింగ్‌కు చెందిన పొలం నుంచి తెప్పిస్తున్నారు.
మట్టి తవ్వకం చేపడుతుండగా.. కార్మికులు అకస్మాత్తుగా ఓ మట్టి కుండ బయటపడింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా.. కళ్లు చెదిరేలా.. బంగారు, వెండి నాణేలు కనిపించాయి. ఈ విషయాన్ని వెంటనే కాంట్రాక్టర్‌కు తెలిపారు కార్మికులు. అతను ఆగమేఘాల మీద అక్కడ వాలిపోయాడు. పరిస్థితిని అంచనా వేసి.. అక్కడ గుమిగూడిన స్థానికులు, కార్మికులకు కొన్ని నాణేలు ఇచ్చి.. ఈ విషయం ఎవరితో చెప్పొద్దని ఆ నిధితో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నిధి దొరికిందన్న వార్త ఆ ప్రాంతంలో వ్యాపించడంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాంట్రాక్టర్‌పై గ్రామపెద్ద కమలేష్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కొన్ని నాణేలు పరిశీలించిన అధికారులు.. అవి 18వ శతాబ్దపు మొఘల్ శకం నాటివని చెబుతున్నారు. దొరికిన నాణేలు ఒక కేజీకి పైగా ఉండొచ్చని చెబుతున్నారు. ఫిర్యాదు అందిందని, మొత్తం కేసును దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనిల్‌కుమార్ తెలిపారు.