బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో! కాల్లో ముల్లు దిగిన మహిళకు ఏకంగా 55 ఆపరేషన్లు! కాలం కలిసి రాకపోతే తాడు కూడా పాముగా మారి కాటేస్తుందనేది ఓ నానుడి. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఆమెకు ఫిషింగ్ హుక్ కాల్లో దిగింది.
చిన్న ముల్లు గుచ్చుకున్నట్టు ఉండటంతో ఆమె విషయాన్ని పట్టించుకోలేదు. కానీ చూస్తుండగానే పరిస్థితి దారుణంగా తిరగబడింది. ఫలితంగా ఆమె ఐదేళ్లలో ఏకంగా 55 ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె కాల్లో కొంత కండ తొలగించడంతో ఆ ప్రాంతంలో చిన్న గొయ్యిలాంటిది ఏర్పడింది. ఇంగ్లండ్‌లోని స్టాన్‌ఫర్డ్-లీ-హోప్ ప్రాంతంలో నివసించే మిషెల్ మిల్టన్ ఎదుర్కొన్న పరిస్థితి ఇది.
మిల్టన్‌కు ప్రస్తుతం 36 ఏళ్లు. 2019లో ఆమె తన సోదరుడితో కలిసి ఫిషింగ్ ట్రిప్‌పై వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు ఫిషింగ్ హుక్ కాల్లో దిగింది. గాయం చిన్నదే కావడంతో ఆమె ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోయింది. ఆ తరువాత నాలుగు రోజులకు కాలంతా బాగా వాచిపోయింది. తీవ్ర జ్వరం వచ్చింది. ఫిషింగ్ హుక్ గుచ్చుకోవడంతో ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్లు గుర్తించారు. యాంటీబయాటిక్స్‌తో ట్రీట్‌మెంట్ ప్రారంభించారు. కానీ ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో వైద్యులు ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు ఆమె కాల్లో కొంత భాగం తొలగించారు. దీంతో మిషెల్ కాల్లో పెద్ద గొయ్యిలాంటిది ఏర్పడింది. ఆ తరువాత కూడా పలు ఆపరేషన్లు, స్కిన్ గ్రాఫ్ట్స్, వాషౌట్స్, కండ తొలగించడాలు వంటివి చేయాల్సి వచ్చింది. కానీ ఆమె కాల్లోంచి ఇన్ఫెక్షన్ పూర్తిగా తొలగిపోలేదు.
మిషెల్ ఇప్పటికీ నొప్పి కారణంగా నరకం అనుభవిస్తుంటుంది. కాలు మొత్తం తొలగించమని వైద్యులను ఆమె పలుమార్లు వేడుకుంది. కానీ డాక్టర్లు మాత్రం అలా చేయడం కుదరదన్నారు. ”అసలేం జరుగుతోందో నాకు అర్థం కావట్లేదు. నొప్పి క్రమంగా పెరిగింది. ఆ తరువాత ఇన్ఫెక్షన్ కాలు అంతా వ్యాపించింది. ప్రతిరోజూ నేను నొప్పిని అనుభవిస్తున్నాను” అని ఆమె వాపోయింది. ఇప్పుడు కూడా ఆమె అధికశాతం ఆసుపత్రిలోనే ఉంటుంది.