విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగుడు అర్ధరాత్రి తహసీల్దార్‌పై దాడి చేయడంతో ఆయన మృతిచెందాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల ప్రకారం.. కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్‌మెంట్‌లో తహసీల్దార్ రమణయ్య నివాసం ఉంటున్నారు. కాగా, శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్‌మెంట్ దగ్గరకు వచ్చాడు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్ వద్దనే ఉన్న రమణయ్యతో సదరు వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. అనంతరం, తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో రమణయ్యపై దాడి చేశాడు. దీంతో, తలకు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలారు.

అది గమనించిన అపార్ట్‌మెంట్‌వాసులు దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకున్నాడు. రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం వరకు రమణయ్య విశాఖ రూరల్ తహశీల్దార్‌గా పనిచేశారు. రమణయ్య విధుల్లో చాలా నిజాయితీగా ఉండేవారని తోటి అనుచరులు చెబుతున్నారు. ఇక, ఈ హత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సిటీ పోలీసు కమిషనర్ రవిశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

కాగా, రమణయ్య హత్య కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో నిందితుడి కోసం 12 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రమణయ్యపై ఇనుప రాడ్‌తో దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.