◾️నల్లబెల్లి లో మూడు వైన్ షాపులు ఉండగా.. రెండు షాపులు కొనసాగింపు ◾️ ఒక కౌంటర్ మొత్తం బెల్ట్ షాపులకే పరిమితం ◾️ అధిక రేట్లకు మద్యం విక్రయాలు ◾️ ప్రభుత్వ నిబంధనలు బేకతారు ◾️ పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు 🍾
రిపబ్లిక్ హిందుస్తాన్,నల్లబెల్లి :వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని వైన్ షాపుల యజమానులు ప్రజలను దోచుకునేందుకు ఒక్కటయ్యారు. సిండికేట్గా మారి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. మండలంలో మూడు వైన్ షాపులు ఉండగా రెండు షాపులలో మాత్రమే రిటైల్ కౌంటర్లు నిర్వహిస్తూ, మూడవ షాప్ మొత్తం ప్రత్యేకంగా బెల్ట్ షాపులకే తరలిస్తున్నారు. మద్యం సీసాలపై ప్రభుత్వం ముద్రించిన ధరల్లో 6 నుంచి 10శాతం అధిక ధరలకు బెల్టు షాపులకు విక్రయిస్తున్నారు. మండలంలో 29గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామంలోని ప్రతి కిరణం షాపు మద్యం బెల్టు షాపుగా మారిపోయింది. వైన్స్ యజమానుల లెక్కల ప్రకారమే మండలంలో 70 నుంచి 80బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు చెప్తున్న సుమారుగా 200నుంచి 400బెల్టుషాపులు మండలంలో అనధికారికంగా కొనసాగుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒక్కో బెల్ట్ షాప్ యజమాని రోజుకు 20 నుంచి 25 వేల రూపాయల విలువ గల మద్యం వైన్ షాపు యజమానుల నుండి కొనుగోలు చేస్తూన్నట్లు తెలుస్తుంది. అధికారుల అండదండలతో రోజుకు లక్షల రూపాయల విలువగల మధ్యాన్ని బెల్టుషాపులకు తరలిస్తున్నారు. మండలంలో మంచినీళ్లు దొరకని గ్రామాలు ఉన్నాయి, అంటే నమ్మొచ్చు గాని మద్యం దొరకని గ్రామాలు ఉండవనేది జగమెరిగిన సత్యం. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్న సంబంధిత అధికారులు బెల్టు షాపుల నిర్వహణ అడ్డుకోవడంలో పూర్తిగా విఫలం చెందినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి షాప్ లో మద్యం విచ్చలవిడిగా దొరకడం వల్ల మద్యం ప్రియులు ఎక్కడపడితే అక్కడ తాగి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.
దర్జాగా దందా... అధికారుల అండ....!? నల్లబెల్లి మండలానికి మూడు మద్యం దుకాణాలు ఉండగా వైన్ షాప్ యజమానులు కుమ్మక్కై రెండు షాపులలో మాత్రమే రిటైల్ కౌంటర్ నిర్వహిస్తూ... ప్రత్యేకంగా మూడవ షాపు మాత్రం మొత్తం బెల్ట్ షాపులకే పరిమితం చేశారు. అందులో నుండి సరుకు మొత్తం బెల్ట్ షాపులకు హోల్సేల్ గా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వైన్స్ యజమానులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరి స్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తూలుతూ చూసీచూడ నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు మద్యానికి బానిసలుగా మారిపోతున్నారు. ఎక్కువ మంది మహిళలు వితంతువు లుగా మారిపోతున్నారు.
పట్టించుకోవాల్సిన పాలకులు అధికారులు చోద్యం చూడడం వల్ల ప్రజలకు భారీగా నష్టం జరుగుతుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని బెల్టుషాపులను మూసివేయాలని, అధిక ధరలకు విక్రయిస్తున్న మద్యం షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.