ప్రపంచవేదికపై భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ప్రచారాన్ని కశ్మీర్ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ యానా మీర్ తీవ్రంగా ఖండించారు.
బ్రిటన్ పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన సంకల్ప్ దివాస్ కార్యక్రమంలో యానా మీర్ ప్రసంగించారు. భారత్‌లో అంతర్భాగం అయిన కశ్మీర్‌లో తనకుభద్రత, స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో పాకిస్తాన్ భారత్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని యానా మీర్ తిప్పికొట్టారు.
భారతదేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నా.. భారతదేశంలో అంతర్భాంగా ఉన్న నా మాతృభూమి కశ్మీర్‌లో ఉన్నా. నేను ఎప్పుడూ అక్కడి నా దేశం నుంచి శరణార్థిలా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను మలాలా యూసఫ్‌జాయ్‌ని అస్సలు కాను. నా దేశాన్ని, నా మాతృభూమి (కశ్మీర్)ను అణచివేయబడిన ప్రాంతమని వ్యాఖ్యానించిన మాటలను తీవ్రంగా తప్పుపడుతున్నా. సోషల్ మీడియా, ప్రపంచ మీడియాలో ఉన్న టూల్‌కిట్ సభ్యులు నా దేశంలోని కశ్మీర్‌ను సందర్శించకుండా అణచివేత పేరుతో వండివార్చిన తప్పుడు కథనాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా’ అని అన్నారు. భారత్‌లోని కశ్మీర్‌ను ఎన్నడూ సందర్శించని, అణచివేత కథనాలను రూపొందించే సోషల్ మీడియా, విదేశీ మీడియాలపై మీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం ఆధారంగా భారతీయులను విభజించే పనులను మానుకోవాలని, మమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి మేము మిమ్మల్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. ‘మా వెంటపడం మానేయండి.. కశ్మీర్ సమాజాన్ని శాంతితో జీవించనివ్వండి’ అని అభ్యర్థిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
జమ్మూ కశ్మీర్‌కు చెందిన సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ యానా మీర్‌ను డైవర్సిటీ అంబాసిడర్ అవార్డుతో యూకే పార్లమెంట్‌లో సత్కరించారు. ఈ సందర్బంగా పార్లమెంట్‌ను ఉద్దేశించిన ప్రసంగించిన మీర్.. కశ్మీర్‌కు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఆ చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తానేమీ మలాలా యూసఫ్‌జాయ్ కాదు అని, భారత్‌లో మేము ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నామని మీర్ ఉద్ఘాటించారు. తాలిబన్ల దాడికి గురైన పాకిస్థాన్ యువతి, నోబెల్ శాంతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ప్రస్తుతం బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే.